రాష్ట్రంలోని అన్ని లిఫ్ట్‌ల బాధ్యత ఇకపై ప్రభుత్వానిదే: సీఎం

 రాష్ట్రంలోని అన్ని లిఫ్ట్‌ల బాధ్యత ఇకనుంచి ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) ఆధ్వర్యంలో అదేవిధంగా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లిఫ్ట్‌ల బాధ్యతలు ఇకపై ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుతం పలు ఎన్‌జీవోలు, కొన్ని సంఘాలు, పలు సొసైటీలు వీటి నిర్వహణ బాధ్యతను చూస్తున్నవి. ఇకపై ఈ లిఫ్ట్‌లన్నింటిని కింద రైతుల మీద ఏటువంటి పైసా భారం లేకుండా అన్నింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇందులో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. వాళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందని వెల్లడించారు. దీని వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఐదారువందల లిఫ్ట్‌లకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. రైతాంగం అంతా సంతోష పడుతరన్నారు. హుజూర్‌నగర్ కృతజ్ఞత సభ ద్వారా తెలంగాణ ఐడీసీ రైతాంగానికి అంతటికి కూడా ఈ శుభవార్త తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు.



ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద ఉన్నటువంటి రాజవరం మేజర్, ముదిమానిక్యం మేజర్, వజీరాబాద్ మేజర్, జాన్‌పహాడ్ మేజర్, బరాకత్ నుంచి వచ్చే ముత్యాల ఎంబీసీ, చిత్రియాల మేజర్, మట్టపల్లి మేజర్, లింగగిరి మేజర్‌లు ఉన్నవి. సమగ్రమైన ప్రణాళికతో వస్తే లిఫ్ట్‌ల మంజూరు, కాల్వల లైనింగ్, అవసరమైన మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపడుతదన్నారు. హుజూర్‌నగర్ గుండా పోయే లింగగిరి మేజర్‌పై కొందరు పేదవాళ్లు ఇండ్లు కట్టుకున్నరు. అదే విధంగా హాలియ పట్టణంలో గల పేరూరు మేజర్‌పై సైతం పలువురు ఇండ్లు కట్టుకున్నరు. వీటి వల్ల ఆయా కాల్వలు కాలుష్యం భారిన పడుతున్నవి. ఈ బాధ పోవాలే, ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు.